“బిబి లో ఏబీ” బ్రిస్బేన్‌ హీట్‌తో ఒప్పందం.. అరంగేట్రానికి అంతా సిద్దం..!

0
175

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిలియర్స్‌ త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌)లో పాల్గొననున్నాడు. డివిలియర్స్‌ తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2019-20 సీజన్‌కు సంబంధించి బీబీఎల్‌ జట్టు అయిన బ్రిస్బేన్‌ హీట్‌తో ఏబీ ఒప్పందం చేసుకున్నాడు. అయితే బిగ్‌బాష్‌ లీగ్‌ సెకండ్‌ హాఫ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌తో డివిలియర్స్‌ కలుస్తాడు.

బీబీఎల్‌లో డివిలియర్స్‌

ఐపీఎల్‌, సీపీఎల్‌, పీఎస్‌ఎల్‌ వంటి లీగ్‌లు ఆడిన డివిలియర్స్‌ త్వరలో బీబీఎల్‌ కూడా ఆడనున్నాడు. ఎన్నో లీగ్‌లలో అభిమానులను అలరించిన డివిలియర్స్‌.. ఇక బీబీఎల్‌లో కూడా తన మార్క్ చూపించనున్నాడు. డివిలియర్స్‌ ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ‘బిగ్ బాష్‌లో బ్రిస్బేన్ హీట్ కోసం సంతకం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గ్రేట్ టీమ్, గ్రేట్ సిటీ’ అని డివిలియర్స్ ట్వీట్ చేసాడు. బ్రిస్బేన్ హీట్‌కు సంతకం చేయడం సులువైన నిర్ణయం. వారు క్రికెట్ దూకుడుగా ఆడుతున్నారు’ అని కూడా అన్నాడు. బ్రిస్బేన్ జట్టులో ఆసీస్ స్టార్ ఆటగాళ్లు క్రిస్ లిన్, మార్నస్ లబషేన్ ఉన్నారు.

వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్స్‌

బ్రిస్బేన్‌ కోచ్‌ డారెన్‌ లీమన్‌ మాట్లాడుతూ… ‘డివిలియర్స్‌ మాతో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉంది. అతనితో కలిసి తొలిసారి పనిచేసే అవకాశం వచ్చింది. వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్స్‌తో కలిసి పని చేసే అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు. అతను 360 డిగ్రీల ఆటగాడు. మైదానం మొత్తం షాట్లు ఆడగలడు. అసాధారణమైన నైపుణ్యం డివిలియర్స్‌ సొంతం. గొప్ప నాయకుడు. బీబీఎల్‌ అనేది ప్రతీ ఒక్కరి టాలెంట్‌ వెలికి తీసే గొప్ప లీగ్‌. అతని ఆట కోసం వేచిచూస్తున్నాం’ అని తెలిపాడు.

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్‌ వీడ్కోలు పలికాడు. దక్షిణాఫ్రికా తరఫున డివిలియర్స్‌ 114 టెస్టులు (8765), 228 వన్డేలు (9577), 78 టీ20లు(1672) ఆడాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన పేరుపై లికించుకున్నాడు. ఐపీఎల్‌-12లో ఆర్సీబీ తరఫున 442 పరుగులు చేశాడు. దాదాపు 45 సగటు, 154 స్ట్రైక్‌ రేట్‌తో ఈ పరుగులు నమోదు చేశాడు. అయితే మిగతావారు విఫలమవడంతో ఆర్సీబీ ప్లేఆఫ్ చేరలేదు.