పివి సింధు వద్దకి శిక్షణ కోసం పృధ్వీ షా…!

0
201

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు వద్దకి శిక్షణ కోసం త్వరలో యువ క్రికెటర్ పృధ్వీ షా రానున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకం వాడిన పృథ్వీ షాపై గత జూలైలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎనిమిది నెలలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ముస్తాక్ అలీ టీ20 సందర్భంగా పృథ్వీ షా నుంచి నమూనాల్ని సేకరించి.. పరీక్షించిన నాడా.. టెర్బుటలైన్ అనే నిషేధిక ఉత్ప్రేరకాన్ని ఈ యువ క్రికెటర్ తీసుకున్నట్లు తేల్చింది. దీంతో.. బీసీసీఐ చర్యలు తీసుకుంది.

నిషేధంలో ఉన్న పృథ్వీ షా.. నవంబరు 15 వరకూ మళ్లీ క్రికెట్‌ ఆడే అవకాశం లేదు. దీంతో.. అప్పటిలోపు ఫిట్‌నెస్ పెంచుకోవాలని ఆశిస్తున్న ఈ యువ క్రికెటర్ పీవీ సింధు వద్దకి శిక్షణ కోసం వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై గత ఏడాది చివర్లో జరిగిన టెస్టు సిరీస్‌కి ఎంపికైన పృథ్వీ షా.. సిరీస్‌కి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో పృథ్వీ షా కాలి మడమకి తీవ్ర గాయమైంది. దీంతో.. ఇప్పటికీ అతను పూర్తి స్థాయిలో ఆ గాయం నుంచి కోలుకోలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అతను మైదానంలో చురుగ్గా కదల్లేకపోయాడు. దీంతో.. అతని ఫీల్డింగ్ ప్రమాణాలకి తగినట్లు లేదని.. దానికి కారణంగా అతని కాలి మడమ గాయమేనని తేల్చేశారు.

బ్యాడ్మింటన్‌లో ఫిట్‌నెస్‌తో పాటు చురకైన ఫుట్‌వర్క్‌తో ఆకట్టుకుంటున్న పీవీ సింధు వద్దకి వెళ్లనున్న పృథ్వీ షా.. ఆ టెక్నిక్‌ని నేర్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి కొన్ని బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా.. తన ఫుట్‌వర్క్‌ని మెరుగుపర్చుకోవాలని ఈ ఓపెనర్ ఆశిస్తున్నాడు. నిషేధంలో ఉండటంతో.. బీసీసీఐ నుంచి ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు ఈ క్రికెటర్‌కి అందవు. ఈ నేపథ్యంలో.. పీవీ సింధు వద్దకి శిక్షణ కోసం వెళ్లాలని ఈ యువ ఓపెనర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.