ఆంధ్రప్రదేశ్ లో ఇసుక విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు అనేక అనుమానాలకు వేదికగా మారింది. తమ వారికి అనుకూలంగా నూతన ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని దాని ద్వారా వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు మినహా ఎవరూ బాగుపడటం లేదనే విమర్శలు విపక్షం నుంచి సహా అనేక వర్గాల నుంచి ఎక్కువగా వినపడుతున్నాయి. రాజకీయ కక్షలతో విపక్షాలకు నష్టం కలిగించటమే కాకుండా తమ వారికి లాభం కలిగించడానికి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సహజ వనరుగా ఉన్న ఇసుకను తమవారికి ప్రభుత్వం దోచిపెడుతుందని ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఇసుక తవ్వకాలు వైకాపా నేతలు జోరుగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో మీడియా అనే దానిని ఇసుక రీచ్ ల దరిదాపులకు కూడా రానీయడం లేదు వైసీపీ నేతలు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇసుక తవ్వకాల మీద అనేక అనుమానాలు కూడా బలంగా వినపడుతున్నాయి. వైసీపీ నేతలు ఇసుకను రోజుల వారీగా పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని కొందరు సాక్ష్యాలతో సహా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆ తవ్వకాల అక్రమాల గురించి వింటే మాత్రం ఆశ్చర్యం కలుగుక మానదు. కొత్తగా వస్తున్నా సమాచారం ప్రకారం ఇసుక రీచ్ లను వైసీపీ నేతలు తమలో తామే పంచుకునే కార్యక్రమం అన్నమాట.
15 రోజులు ఒక ఎంపీ తీసుకుంటే లేదా ఒక ఎమ్మెల్యే తీసుకుంటే తర్వాత 15 రోజులు పదవిలో ఉన్న మంత్రిగాని లేక మరొకరు గాని తీసుకోవడం లేదా.. ఎక్కువ మంది ఉంటే ఏడు రోజులు ఒకరు తీసుకోవడం మరో ఏడు రోజులు మరొకరు తీసుకోవడం… ఎవరికి ఇచ్చిన సమయం వాళ్ళు వినియోగించుకోవాలి. వర్షం పడినా ఏం పడినా సరే ఇచ్చిన గడువులోగా తమ ఇసుకను తాము తోలుకోవాలి. రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముందు ఉండి నడిపిస్తూ గడువులు పెట్టుకుని ఇసుక వ్యాపారం చక్కగా చేసుకుంటున్నారు. దీనిలో సహకరించిన అధికారులకు కానుకలు కూడా విడతల వారీగా ఇస్తున్నట్లు ఈ పంపకాల్లో అవకాశం రాని నాయకులు తమ అనుయాయుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు.























