“ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు”..!

0
193

ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే కేబినెట్‌ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలగనుంది. దీంతో ప్రత్యా మ్నాయాలు ఆలోచిస్తోంది. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన మోటార్‌ వెహికల్‌ (అమెండ్‌మెంట్‌ యాక్టు)–2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కల్పించిన అధికారాల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. అధిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.