నెంబర్ వన్‌గా ఎదుగుతున్న తళపతి విజయ్.. రజినీకాంత్ ఇమేజ్‌కు పరీక్ష..!

0
173

తమిళనాట నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్న గానీ ప్రేక్షకులను అడిగితే మీకేమైనా పిచ్చి పట్టిందా రజినీకాంత్ ఉన్నాడు కదా.. ఇంకెవరు అంటారు. అవును నిజమే.. తమిళనాట రజినీకాంత్ కాకుండా మరో హీరోను నెంబర్ వన్ అనడానికి లేదు. ఆయన స్టామినా.. ఛరిష్మా అలా ఉంటాయి. కానీ ఇప్పుడు నిజంగానే అంత ఇమేజ్.. మార్కెట్ రజినీకాంత్ సినిమాకు ఉందా..? ఈ ప్రశ్న గానీ సూటిగా అడిగితే చెప్పడానికి మొహమాటపడినా లేదనే చెప్పాల్సి వస్తుంది. పరిస్థితులు కూడా ఇప్పుడు ఇలాగే మారిపోతున్నాయి. తమిళనాట అసలైన నెంబర్ వన్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.

ఎందుకంటే శంకర్ లాంటి దర్శకుడితో కలిసి 540 కోట్లతో తెరకెక్కిన 2.0 సినిమాతో ఇండస్ట్రీ రికార్డుల్లో ఒక్కటి కూడా కదిలించలేకపోయాడు రజినీకాంత్. పోనీ ఒక్క సినిమాతో ఏదో అనుకుంటే ఏమో అనుకోవచ్చు.. గత మూడు సినిమాలు కూడా రజినీకాంత్ ఫ్లాపులే ఇచ్చాడు. పేట కూడా కమర్షియల్‌గా ఫ్లాప్ అయింది. ఈ చిత్రం 100 కోట్లు షేర్ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చింది.. ఆ సినిమా కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే తీసుకొచ్చింది. అజిత్ లాంటి హీరో విశ్వాసం సినిమాతో పోటీకి వస్తే పేట తట్టుకోలేకపోయింది.

మరి అప్పటికి ఇప్పటికీ రజినీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా..? మరోవైపు విజయ్ మాత్రం సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. తను ఎంచుకుంటున్న కథల్లో కూడా సామాజిక బాధ్యత చూపిస్తున్నాడు. మెర్సల్.. సర్కార్ సినిమాలు సోలోగా వచ్చి 250 కోట్లు వసూలు చేసాడు విజయ్. అందులో ముఖ్యంగా తమిళ్ మార్కెట్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే రజినీకాంత్ మాదిరి విజయ్ సినిమాకు తెలుగు, హిందీల్లో అంత మార్కెట్ లేదు.

విజయ్ ఏం చేసినా తమిళనాడులోనే చేయాలి. అంటే ఇప్పుడు మార్కెట్ పరంగా చూసుకుంటే విజయ్ సినిమాలకే రజినీకాంత్ కంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. 2.0 కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసినా కూడా దాని బడ్జెట్ ఎక్కువ. పేట సినిమా కూడా ఊహించిన వసూళ్లు తీసుకురావడంలో విఫలం కావడంతో రజినీ స్టామినాపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. వరసగా రజినీకాంత్ సినిమాలకు వస్తున్న పరాజయాలు.. విజయ్ సినిమాలకు పెరుగుతున్న డిమాండ్.. మార్కెట్ చూస్తుంటే సూపర్ స్టార్ కూడా అందరిలాంటి హీరోనే అనిపించక మానదు.