తమిళ అగ్ర కథానాయకుడు విక్రమ్‌కు సినిమాల్లో వివిధ రకాల గెటప్పుల్లో కనిపించడమంటే చాలా ఇష్టం. సినిమాలో కథ కంటే గెటప్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని పేరు సంపాదించుకున్నాడు. విక్రమ్ ఏదైనా సినిమా అంగీకరించాడంటే అందులో కచ్చితంగా కొత్త లుక్‌లో కనిపిస్తాడని జనం ఫిక్సయిపోయారు. అయితే గెటప్‌ల మీద ఉన్న దృష్టి కథల మీద లేకపోవడంతో ఆయన సినిమాలు వరుసగా పరాజయం పాలవుతన్నాయి.
విక్రమ్ తాజాగా దర్శకుడు జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 25 విభిన్న గెటప్పుల్లో కనిపించబోతున్నాడట. ఒకే సినిమాలో 25 గెటప్స్ వేసిన హీరో ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ లేరట. ఆ మేరకు విక్రమ్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు. అయితే కంటెంట్ మీద కూడా దృష్టి పెడితే మరింత బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.




























