రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) 58 పేజీల నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అనేక అంశాలపై సమగ్రంగా విశ్లేషణ చేయడంతోపాటు పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో నొక్కి చెప్పింది. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కావాలనే విషయమై ప్రభుత్వం ఇటీవలే విద్యార్థుల తలిదండ్రుల నుంచి లిఖితపూర్వక ఆప్షన్లను సేకరించగా.. 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎస్‌సీఈఆర్‌టీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్‌సీఈఆర్‌టీ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.























