కరోనా వైరస్ రాక ముందే దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కరోనా’.. ఆర్థిక వ్యవస్థను రెండు నెలలపాటు లాక్‌డౌన్ చేసేసింది. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రేరణగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రుణ రేట్లు మరింత దిగివచ్చేందుకు వీలుగా రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే నిధులపై వసూలు చేసే రేటు)ను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) మేర కోత విధించి 4 శాతానికి తీసుకొచ్చింది. ఇది 20 ఏళ్ల (2000 తర్వాత) కనిష్ట స్థాయి.
ఈ నిర్ణయంతో రెపో ఆధారిత గృహ, వాహన, వ్యక్తిగత, ఇతర టర్మ్ రుణాల రేట్లు దిగొస్తాయి. అటు రివర్స్ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై చెల్లించే రేటు)ను కూడా 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ఆర్‌బీఐ వద్ద నిధులు ఉంచడానికి బదులు రుణ వితరణ దిశగా బ్యాంకులను ప్రోత్సహించనుంది. మరోవైపు రుణగ్రహీతలకు మరింత ఉపశమనం కల్పిస్తూ.. రుణ చెల్లింపులపై మారటోరియంను మరో మూడు నెలలు పొడిగించింది. అవసరమైతే రేట్లను మరింత తగ్గించేందుకు వీలుగా ‘సర్దుబాటు ధోరణి’నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎంపీసీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వీడియో సందేశం రూపంలో తెలియజేశారు.























