నేటి కోవిడ్ సంక్షోభ కాలాన్ని, నరేంద్రమోదీ రెండు ప్రపంచ యుద్ధాల నాటి విధ్వంసంతో పోల్చారు. కానీ, నాడు ఆ వినాశనం నుంచి బయట పడేందుకు తమ తమ కరెన్సీలను విస్తారంగా ముద్రించి (‘ద్రవ్యలోటు’ భావనను పట్టించుకోకుండా) తద్వారా ప్రజల కొనుగోలు శక్తినీ, డిమాండ్‌నూ పెంచటం విషయంలో ప్రపంచ దేశాలు అనుసరించిన మార్గాన్ని అనుసరించడానికి మోదీ వెనుకాడుతున్నారు. నిజానికి, నేటి సంక్షోభ కాలంలో, ప్రపంచంలోని అనేక దేశాలు, భారీగా తమ తమ కరెన్సీల ముద్రణ ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నిరంతరం ‘స్వదేశీ’ మంత్రాన్ని జపిస్తోన్న మన పాలకులు మాత్రం విదేశీ రేటింగ్ సంస్థలకు వెరుస్తూ, షేర్ మార్కెట్లో విదేశీ మదుపుదారుల ప్రయోజనాలను కాపాడుతూ, అంతర్జాతీయరుణ సంస్థల షరతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. మనది ఒక సార్వభౌమాధికార దేశమని, మన కరెన్సీ రూపాయిపై, దాని ముద్రణపై పెత్తనం,అధికారం మనదేననే విషయాన్ని మరచిపోతున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మూల సిద్ధాంతమైన స్వదేశీని బూజుదులిపి స్వావలంబన రూపంలో బయటకు తీసింది. మే 5వ తేదీన మన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారు దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించుకునే ఆలోచన చేస్తున్నామని, (దానికి అనుగుణంగా) విదేశాల నుంచి వచ్చే దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ఉత్పత్తి చేసేందుకు సాంకేతికంగా ఆధునీకరించుకోవాలని భారత పారిశ్రామిక రంగానికి పిలుపును కూడా ఇచ్చారు. అలాగే, మే 12వ తేదీన 20 లక్షల కోట్ల ఉద్దీపన పేరిట ఒక విధాన, ఆర్థిక ‘‘పథకాన్ని’’ ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ కూడా స్వావలంబనను ఈ విధానం తాలూకు కేంద్ర బిందువుగా సెలవిచ్చారు.
కానీ, ఈ స్వదేశీ విధానం దిశగా సాగే చిత్తశుద్ధి, సాహసం బీజేపీ నాయకత్వానికి ఉందా ? జవాబులు చూద్దాం. గతంలో వాజ్‌పేయి హయాం నుండి కూడా బీజేపీ మూల సిద్ధాంతాలుగా వున్న రెండు అంశాలు : 1. హిందూత్వ 2. స్వదేశీ. కాగా, ఇక్కడ మనం గమనించాల్సింది ఒక రాజకీయ పక్షంగా బీజేపీ తాలూకు సైద్ధాంతిక విజయం ప్రధానంగా స్వదేశీ తాలూకు వాగ్దానాల పునాదిపైనే ప్రాథమికంగా ఆధారపడి ఉంది. అంటే స్వదేశీ రూపంలో దేశ ప్రజల కనీస ఆర్థిక అవసరాలను పరిపూర్తి చేసిన తర్వాతే ఆ స్థిరమైన పునాదిపై బీజేపీ తన నినాదమైన హిందూత్వను సంపూర్ణంగా విజయవంతం చేసుకోగలదు.























