దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్‌కి భారత తుది జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. కీపర్‌గా సాహాకి అవకాశమిచ్చింది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఆడనుండగా.. మిడిలార్డర్‌లో హనుమ విహారి చోటు దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకి మరో అవకాశం దక్కగా.. గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు.
వైజాగ్ టెస్టుకి భారత్ జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ
తుది జట్టు ప్రకటన ద్వారా.. ఏడుగురు బ్యాట్స్‌మెన్, నలుగురు బౌలర్ల కాంబినేషన్‌తో టీమిండియా బరిలోకి దిగబోతున్నట్లు తేలిపోయింది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో పేలవంగా విఫలమైన రిషబ్‌పంత్‌పై వేటు వేయబోతున్నట్లు గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. ఇక సాహా.. గత ఏడాది జనవరిలో ఆఖరిగా భారత్ తరఫున టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. విండీస్‌పై సెంచరీ బాదిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి వైజాగ్‌లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. విహారి పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంది.




























