దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం వ్యక్తిగత స్కోరు 63 వద్ద ఈరోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ 173 బంతుల్లోనే 16 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 26వ శతకంకాగా.. కెప్టెన్‌గా 19వ సెంచరీ.
ఈరోజు ఓవర్‌నైట్ స్కోరు 273/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. విరాట్ కోహ్లీ (102 బ్యాటింగ్: 179 బంతుల్లో 16×4), అజింక్య రహానె (52 బ్యాటింగ్: 153 బంతుల్లో 8×4) నిలకడగా ఆడుతుండటంతో.. 111 ఓవర్లు ముగిసే సమయానికి 348/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. గురువారం ఆఖరి సెషన్ నుంచి సఫారీ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటున్న ఈ జోడీ.. ఇప్పటికే నాలుగో వికెట్‌కి అజేయంగా 304 బంతుల్లో 150 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతోంది.























