భారత్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి మందులు, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వైట్‌హౌస్ రోజ్ గార్డెన్‌లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మందులు కనుక్కోవడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు చేస్తున్న కృషి మరువలేనిది’అని అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పరిశోధనకారులు, శాస్త్రవేత్తల్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఇదే తొలిసారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వర్సిటీలు, రీసెర్చ్ వర్సిటీలు, బయో ఫార్మా స్టార్టప్‌లలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై మందులు, వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్, అమెరికా సంయుక్త కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుక్కుంటామని ట్రంప్ చెప్పారు.




























