వాళ్ళిద్దరూ టీం లోకి వచ్చిన సమయంలో మిడిల్ ఆర్డర్ లో ఆడారు… జట్టుకి అంతగా వాళ్ళతో ఉపయోగం లేదనుకున్నారో ఏమో కొన్ని రోజులు పక్కన పెట్టారు… మిడిల్ ఆర్డర్ లో మళ్ళీ అవకాశాలు ఇచ్చారు… అయినా ఆకట్టుకోలేకపోయారు. ఇద్దరికీ కెప్టెన్లు కొత్తగా ఆలోచించి కొత్త స్థానంలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరూ తమను తాము నిరూపించుకున్నారు. ఓపెనింగ్ కి పంపిన సారధి విశ్వాసాన్ని నిలబెట్టారు. తాము జట్టు అవసరాలను ముందే గ్రహించి ఆడతామని ఓపెనింగ్ లో వచ్చి తమ ‘వీర’ హిట్టింగ్ తో దుమ్ము రేపారు. ఇద్దరూ కలిసి ఆడితే చూడాలి అనుకునేలా చేశారు.
ఒకరు రిటైర్ అయిపోగా మరొకరు ఇప్పుడు క్రికెట్ లో తన మార్క్ వేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. వాళ్ళే వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ. కెరీర్ ఆరంభంలో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన ఈ ఇద్దరూ తర్వాత వచ్చిన ఓపెనింగ్ అవకాశాలను సమర్ధవంతంగా వినియోగించుకుని దుమ్ము రేపారు. కెరీర్ ఆరంభంలో సెహ్వాగ్ మిడిల్ ఆర్డర్ లో రాగా అతని దూకుడు తెలిసిన అప్పటి కెప్టెన్ గంగూలీ ఓపెనింగ్ కి పంపగా దుమ్మురేపాడు సెహ్వాగ్. ఆ తర్వాత దాదాపు పదేళ్ళ పాటు ఓపెనర్ గా ఎవరికి అందని ఎత్తులో మూడు ఫార్మాట్లలోను తన మార్క్ వేసాడు. టెస్ట్ అయినా, టి20 అయినా, వన్డే అయినా సరే తనకు తెలిసిన వీర బాదుడు తో ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు.
ఇక ఇప్పుడు రోహిత్ శర్మ… సెంచరీ చేసిన తర్వాత 40 బంతులు ఆడితే చాలు డబుల్ సెంచరీ చేయడం ఖాయం అనుకునే విధంగా ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో దాదాపు ఆరేళ్ళ నుంచి కీలక ఆటగాడిగా మారిపోయాడు. అయితే టెస్ట్ జట్టులో మాత్రం సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. సీరీస్ కి ఎంపికైనా తుది జట్టులో ఆడలేకపోయాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సీరీస్ లో మొదటి టెస్ట్ లో ఓపెనర్ గా వచ్చి రెండు సెంచరీలు చేసి సెహ్వాగ్ లా తాను కూడా అన్ని ఫార్మాట్లకు సరిపోతాను అని నిరూపించాడు. సెహ్వాగ్ లా ముందు నుంచే బాధకుండా క్రీజ్ లో నిలబడిన తర్వాత బాదడం మొదలుపెట్టి జట్టు విజయాలకు బాటలు వేస్తున్నాడు.























