సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపడానికి అనుమతివ్వాలి. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలి. ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలి. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ప్రయాణికులందరూ మాస్క్ ధరించాలి. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలి.
బస్సు సర్వీసులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే అంశంపై మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటించాలి. కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణించడానికి అనుమతించాలి. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణపై దృష్టి సారించాలి.
వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పని చేశారు. రాష్ట్రం మీదుగా నడిచి వెళ్తున్న వారికి సహాయంగా నిలిచారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వీళ్లు మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా? అని ఆలోచించకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. మానవత్వంతో వారిని ఆదుకోవాలి. వలస కార్మికుల తరలింపు త్వరితగతిన పూర్తి చేయాలి.























