గ్రేటర్‌లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా కరోనా బాధితులు పెరగడంతో పాటు కంటైన్మెంట్ల సంఖ్య కూడా రెట్టింపవుతోంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 60కిపైగా కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వీటిలో శనివారం నాటికి ఎల్బీనగర్, మలక్‌పేట, చార్మినార్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలోనే 50కిపైగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు వ్యక్తిగత నివాసాల్లో ఉండేవారికే కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కేవలం వ్యక్తిగత నివాసాలకే కంటైన్మెంట్ పరిమితం చేశారు. తాజాగా అపార్ట్‌మెంట్ వాసుల్లోనే వైరస్ వెలుగు చూస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా అదే భవనంలోని 50 నుంచి 100 కుటుంబా లు చిక్కుల్లో పడాల్సివస్తోంది.




























