ఆల్ టైం రికార్డు ని సొంతం చేసుకున్న పాకిస్తాన్..!

0
174

పాకిస్తాన్‌లో తీవ్ర ఆర్ధిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అందినచోటల్లా అప్పులు చేస్తున్నారు. ఆర్ధిక సాయం కోసం ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుండగానే.. అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తూ తాజాగా కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే ఇమ్రాన్ ప్రభుత్వం 7,509 బిలియన్ల పాకిస్తానీ రూపాయల మేర  అప్పులు చేసింది. దీంతో అత్యధిక అప్పులు చేసిన ప్రభుత్వంగా పాకిస్తాన్ ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది. స్థానిక మీడియా కథనం ప్రకారం ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి రుణాల వివరాలు పంపింది.

ఈ డేటా ప్రకారం.. 2018 ఆగస్టు నుంచి 2019 ఆగస్టు వరకు పాక్ ప్రభుత్వం విదేశాల నుంచి రూ.2,804 బిలియన్ల మేర అప్పులు తీసుకోగా.. దేశీయంగా రూ. 4,705 బిలియన్ల అప్పు చేసినట్టు తేలింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వ అప్పులు 1.43 శాతం పెరిగినట్టు తాజాగా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టులో రుణాలు రూ.24,732 బిలియన్లు ఉండగా.. ఈ ఏడాది ఆగస్టులో అప్పులు రూ.32,240 బిలియన్లుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 1 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయల మేర పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇమ్రాన్ ప్రభుత్వం రూ. 960 బిలియన్ల మేర పన్నులు వసూలు చేసింది.