ఇంగ్లీషు మీడియంపై జీవో జారీ..

0
267

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి. వాటిల్లో విద్యార్థులు కోరుకుంటే సమాంతరంగా ఆంగ్ల మాధ్యమ తరగతుల్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం అమలవుతున్న ప్రభుత్వ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ స్కూళ్లు యధాతథంగా కొనసాగుతాయి. ఇక 7, 8, 9, 10 తరగతులు కూడా ఏటా క్రమేణా ఆంగ్ల మాధ్యమాలుగా మారతాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో ఆప్షన్‌ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు మూడు ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు మాధ్యమంలో బోధన, ఇతర మాతృ భాషల్లో బోధనలో ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇచ్చారు.

మొత్తం 17,97,168 మంది నుంచి ఆప్షన్లు రాగా 53,943 మంది తెలుగు మాధ్యమంలో బోధన కోరుకున్నారు. అయితే ఈ విద్యార్థుల కోసం ఆయా పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తరగతుల ఏర్పాటు పాలనాపరంగా, ఆర్థికపరంగా సాధ్యం కాదు కనుక గతంలో ఇచ్చిన జీఓ 15 ప్రకారం ప్రతి మండల కేంద్రంలో (672 మండలాల్లో) ఒక తెలుగు మాధ్యమ పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పిస్తారు. దూరంగా ఉన్నవారికి రవాణా ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here