కరోనా వైరస్ సృష్టికర్త చైనాయే కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా వల్ల కలిగిన తీవ్ర నష్టానికి చైనానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 మహమ్మారి వూహాన్ ప్రయోగశాలలోనే పుట్టిం దని, అది లీక్ అయి బయటపడి ఉత్పాతం సృష్టించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇతర అత్యున్నతాధికారులు పదే పదే ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ కరోనా వైరస్‌ని చైనాయే కృత్రిమంగా సృష్టిం చినట్లు చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంతర్జాతీయ జీవాయుధ నిపుణులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఆరోపణలు ఏమేరకు చెల్లుబాటు అవుతాయన్నది సందేహాస్పదంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్లుగా ప్రపంచానికి సరుకుల సరఫరా కేంద్రంగా ఉంటూ వచ్చిన చైనాపై అతిగా ఆధారపడటం తగ్గించుకోవాలని అమెరికా, యూరప్ దేశాలు భావిస్తున్నాయి.
అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో నేతృత్వంలో భారత్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాతో సహా ఏడు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవలే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని కరోనా సాంక్రమిక వ్యాధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావాలు, ప్రపంచం ముందున్న మార్గాల గురించి చర్చించారు. ప్రయోగాత్మక ఆన్‌లైన్ డిప్లొమసీగా పేర్కొన్న ఈ సదస్సులో ప్రపంచంలో ఒకే ఒక్క దేశం నుంచి అంటే చైనా నుంచి సరుకుల సరఫరాపై ఆధారపడటాన్ని తగ్గిం చుకోవడం ఎలా అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పైగా, గత కొంతకాలంగా పారిశ్రామిక వస్తువుల సరఫరా మార్గాలను చైనా వెలుపలకు తరలించే పథకాల గురించి ట్రంప్ యంత్రాంగం తరచుగా ప్రస్తావిస్తూ వస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి, కరోనా వంటి ఉత్పాతం ఇక ఎన్నడూ జరగని విధంగా వస్తు సరఫరా మార్గాలను పునర్నిర్మించే మార్గాలను కనుగొనడానికి అమెరికా ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాంలతో కలిసి పనిచేస్తోందని ఏప్రిల్ 29న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు.




























