ఒకే ట్రాక్ పై రెండు రైళ్ళు – ఆగివున్న రైలును గుద్దిన మరో రైలు – గాయపడ్డ 30మంది ప్రయాణికులు

0
208

కాచిగూడ నింబోలి అడ్డలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్‌ రైలు, హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సాంకేతిక లోపంతో హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచి ఉన్న ట్రాక్‌లోకి ఎంఎంటీస్ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 30 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్యాసింజర్ రైలు, ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు గాయపడ్డారు. సిగ్నల్స్ గమనించకుండా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్.. నాలుగో ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న ఇంటర్‌సిటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎంఎంటీఎస్‌కు చెందిన మూడు బోగీలు ధ్వంసమయ్యాయి.

ఎంఎంటీఎస్ ఇంజిన్ భోగీ ఇంటర్‌సిటీ రైల్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. లోకోపైలట్ చంద్రశేఖర్ ఇంజిన్‌లో ఇరుక్కుపోయాడు. అతడిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం కాచిగూడ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఎంఎంటీఎస్ రైలు ఫలక్‌నూమా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రెండో ట్రాక్‌లోకి వెళ్లాల్సిన రైలు నాలుగో లైన్‌లోకి వెళ్లడంతో ఆగి ఉన్న రైలును ఢీకొట్టింది. దీంతో రైలు ఆరు బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో లోకల్ ట్రెయిన్లను అధికారులు రద్దుచేశారు. అలాగే కాచిగూడ నుంచి వెళ్లాల్సిన అన్ని సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ట్రెయిన్ ఆగి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఊహించని ఈ ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు రైళ్లకు మధ్యన ఇరుక్కుపోయిన లోకో పైలట్ కాపాడాలంటూ కేకలు వేశాడు. కర్నూలు నుంచి సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ వద్ద ఆగి ఉన్న సమయంలోనే దీనిని గమనించకుండా ఎంఎంటీఎస్ దూసుకొచ్చింది.