“అయ్యో బంగ్లా” – ‘T20 సిరీస్’ ముందు “బంగ్లాదేశ్”కు ఎదురుదెబ్బ..!

0
181

భారత్‌తో టీ20 సిరీస్‌ ముంగిట బంగ్లాదేశ్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నవంబరు 3 నుంచి భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌ని బంగ్లాదేశ్ ఆడనుండగా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ మహ్మద్ సైపుద్దీన్ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. బంగ్లాదేశ్‌ తరఫున 13 టీ20లు ఆడిన సైపుద్దీన్ 12 వికెట్లు పడగొట్టాడు.

వెన్నునొప్పి కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్న సైపుద్దీన్ ఇటీవల ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపించడంతో అతడ్ని టీ20 జట్టులోకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. కానీ.. తాజా పరీక్షల్లో అతను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది ముగిసిన వన్డే ప్రపంచకప్ సమయంలో గాయపడిన సైపుద్దీన్.. ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్‌తో పాటు అనంతరం జరిగిన శ్రీలంక పర్యటనకీ దూరంగా ఉన్నాడు. అయితే.. ఆ తర్వాత వెన్నునొప్పి‌ నుంచి కోలుకుని బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆడాడు. కానీ.. తాజాగా వెన్ను గాయం మళ్లీ తిరగలోడటంతో భారత్‌తో సిరీస్‌కి దూరమయ్యాడు.