“మీర్‌పేట్ లో భారీ పేలుడు – మహిళకు తీవ్ర గాయాలు”

0
197
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో ఉదయం చెత్త ఏరుకుంటున్న నిర్మల్ అనే మహిళకు స్టీల్ డబ్బా దొరికింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు ఆమె దాన్ని నేలకేసి బలంగా కొట్టింది. దీంతో భారీ శబ్దంతో ఆ బాక్స్ పేలిపోయింది. అందులోని మేకులు, గాజుపెంకులు గుచ్చకోవడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాంబ్ స్వ్కాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పేలుడు ఎలా సంభవించింది, ఆ బాక్స్‌‌ను అక్కడ ఎవరు పడేశారు? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. కొద్ది నెలల క్రితం రాజేంద్రనగర్‌లో కూడా ఓ వ్యక్తి చెత్తకుప్పలో దొరికిన వస్తువును పగులగొట్టడంతో అది పేలిపోయింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. మరోసారి అలాంటి ఘటనే జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.