లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తే.. ప్రజా జీవనం స్తంభించి పేద, మధ్య తరగతి ప్రజలు తమ జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని భావించి ప్రభుత్వం ఆంక్షల్ని సడలించింది. నగరంలోని చాలా మంది ఆంక్షల సడలింపు అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గినట్లుగా భావిస్తున్నారు. అవసరం లేక పోయినా రోడ్లపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. నిత్యావసరాలు, కూరగాయలు, చికెన్, మటన్ కొనుగోలు పేరుతో ఆయా మార్కెట్లకు పోటెత్తుతున్నారు.
బర్త్‌డేల పేరుతో పార్టీలు ఏర్పాటు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్.. తాజాగా మరింత విజృంభిస్తున్నది. మర్కజ్, ఎన్నారై మూలాలు లేని కుటుంబాల్లో వైరస్ తీవ్ర రూపం దాల్చుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న ఈ కేసుల మూలాలు అధికారులకు సైతం అంతు చిక్కడం లేదు.























