దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించే లక్ష్యంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ మూడో దశ నేటితో ముగియనుంది. ఈ నెలాఖరు వరకు కొనసాగే నాలుగో దశ లాక్‌డౌన్ ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలున్నాయని కేంద్రం సూచనలిచ్చింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. నాలుగో దశలో భాగంగా కంటైన్‌మెంట్ జోన్లలో మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఆటోలు, రిక్షాలు, బస్సులు, క్యాబ్‌లు తిరిగేందుకు కేంద్రం అనుమతించే చాన్సుంది.
కంటైన్‌మెంట్ జోన్లుకాని అన్ని జిల్లాల్లో అత్యవసరేతర వస్తువుల సరఫరా, ఈ–కామర్స్ సంస్థలకు ఓకేచెప్పనుంది. ఆఫీస్‌లు, కర్మాగారాలను మరింత మంది సిబ్బందితో నడిపేందుకు వెసులుబాటు ఇచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్ రెడ్ జోన్ల నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చనుందని సమాచారం. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్‌డౌన్ సమయంలో 33 శాతం సిబ్బందితోనే ఫ్యాక్టరీలుఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే, మరింత మంది సిబ్బందిని పనుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దేశంలో జూన్, జూలై నెలల్లో మరింతగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా కేంద్రం ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తూండటం గమనార్హం.



























