భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంటే.. స్టేడియంలో టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి నిద్రపోతున్న ఫొటో ఇటీవల వైరల్‌గా మారింది. హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి మ్యాచ్‌ని పరిశీలిస్తూ.. అందుకు అనుగుణంగా జట్టు వ్యూహాల్లో కెప్టెన్‌కి సాయపడాల్సిందిపోయి ఇలా బాధ్యతారాహిత్యంగా నిద్రపోవడమేంటి..? అని కొందరు ప్రశ్నల వర్షం గుప్పించారు. మరికొందరు రవిశాస్త్రి కునుకు తీస్తున్న ఫొటోపై సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చారు. మొత్తంగా.. రవిశాస్త్రి నిద్రపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో.. ఎట్టకేలకి అతను స్పందించాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ జట్టు.. మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో తనపై విమర్శలు, సెటైర్లు రావడంపై రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘వారిని అలానే ఎంజాయ్ చేయనివ్వండి.. కానీ.. నేను ఆ విమర్శలు, సెటైర్లని అస్సలు పట్టించుకోను. రాంచీ టెస్టులో నేను ఒక్క బాల్ కూడా మిస్సవ్వలేదు’ అని రవిశాస్త్రి వివరణ ఇచ్చాడు. గతంలోనూ మ్యాచ్‌ల టైమ్‌లో రవిశాస్త్రి వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. భారత్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై పర్యటిస్తున్న సమయంలో మద్యం తాగుతూ కెమెరాలకి చిక్కిన రవిశాస్త్రి.. ఆ సిరీస్‌లో ఓ మ్యాచ్ ముగిసిన తర్వాత మద్యం మత్తులోనే వచ్చి మీడియాతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి.























