“నగరం నడిబొడ్డున నలుగురి హతం! పారిస్ లో ఉన్మాది మారణకాండ”..!

0
220

ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. నిత్య యవ్వనంతో నవ్వుతూ.. తుళ్లుతున్నట్లుగా ఉండే పారిస్ నగరానికి తాజాగా ఊహించని విషాదం చుట్టేసింది. ఒక ఉన్మాది వీరంగం అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేయటమే కాదు.. యావత్ నగరం ఉలిక్కిపడేలా చేసింది.

పారిస్ నడిబొడ్డున ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పని చేసే ఉద్యోగి.. అక్కడే పని చేసే మరో నలుగురు పోలీసు అధికారులపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడిలో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడి.. మరణించారు. ఊహించని ఈ పరిణామంతో ఉలిక్కి పడిన అక్కడి పోలీసు అధికారులు.. ఆ వెంటనే తేరుకొని ఉన్మాదిపై కాల్పులు జరిపి హతమార్చారు.

దాడి మొదలైన వెంటనే చుట్టుపక్కల వారంతా భయంతో పరుగులు తీశారు. మరికొందరు ఏడవటం కనిపించినట్లు చెబుతున్నారు. దాడికి కారణాలు తెలీకున్నా.. అంత బీభత్సాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు. ఈ ఉదంతం చోటు చేసుకున్న సమయంలో కొందరు పోలీసులు.. పర్యాటకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..కత్తిపోట్లు జరిపిన వ్యక్తి వివరాలు బయటకు రాలేదు. తాజా దాడిలో ఉగ్రహస్తం ఉందనుకోవటం లేదని అధికారులు చెబుతున్నారు. మరణించిన ఉన్మాది వివరాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఉదంతం కారణంగా టర్కీకి వెళ్లాల్సిన దేశ అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి క్రిస్టోఫ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇటీవల కాలంలో ఇంతటి దారుణ దాడిని తామిప్పటివరకూ చూడలేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.