ఇండియా తోలి ఇన్నింగ్స్ 601/5 డిక్లేర్డ్

0
167

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 601/5 వద్ద డిక్లేర్ చేసింది. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 273/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (254 నాటౌట్: 336 బంతుల్లో 33×4, 2×6) అజేయ డబుల్ సెంచరీ బాదడంతో భారీ స్కోరు నమోదు చేయగలిగింది.

కోహ్లీతో పాటు ఈరోజు రవీంద్ర జడేజా (91: 104 బంతుల్లో 8×4, 2×6), అజింక్య రహానె (59: 169 బంతుల్లో 8×4) హాఫ్ సెంచరీలతో మెరవగా.. తొలిరోజైన గురువారం మయాంక్ అగర్వాల్ (108), చతేశ్వర్ పుజారా (58) కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ మూడు వికెట్లు, కేశవ్ మహరాజ్, ముత్తుసామి చెరో వికెట్ పడగొట్టారు.

వైజాగ్ వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. తాజాగా పుణె టెస్టులోనూ భారీ స్కోరుతో సఫారీలను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 63తో ఈరోజు తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన విరాట్ కోహ్లీ.. తొలి సెషన్‌లోనే సెంచరీ మార్క్‌ని అందుకున్నాడు. కెప్టెన్‌కి చక్కటి సహకారం అందించిన రహానె కూడా హాఫ్ సెంచరీ బాదడంతో తొలి సెషన్‌లో సఫారీలకి కనీసం ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలో రహానెతో కలిసి నాలుగో వికెట్‌కి 178 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. టీమిండియా భారీ స్కోరుకి బాటలు వేశాడు.

జట్టు స్కోరు 376 పరుగుల వద్ద రహానె ఔటవగా.. అనంతరం వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ గేర్ మార్చాడు. టీ విరామం తర్వాత టీ20 తరహా హిట్టింగ్‌తో రెచ్చిపోయిన ఈ జోడీ సఫారీ బౌలర్లని ఉతికారేసింది. ఈ క్రమంలో ఐదో వికెట్‌కి అభేద్యంగా 225 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ- జడేజా జోడీ.. భారత్‌ని 601/5తో తిరుగులేని స్థితిలో నిలిపింది. డబుల్ సెంచరీ తర్వాత 250 పరుగుల మైలురాయిని కూడా అందుకున్న విరాట్ కోహ్లీ.. శతకం ముంగిట జడేజా ఔటవగానే ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత్ జట్టు 600పైచిలుకు స్కోరు చేయడం ఇది పదోసారి కావడం విశేషం.