పేదలకు రూ.1,500 నగదు సాయం ఆపొద్దు

0
300

వరుసగా మూడు నెలలు రేషన్‌ బియ్యం తీసుకోని తెల్ల రేషన్‌ కార్డు దారులకు రూ.1,500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్‌డౌన్‌ లాంటి కష్టకాలంలో నగదు సాయం ఎలా నిలిపేస్తారని ప్రశ్నించింది. మూడు సార్లు బియ్యం తీసుకున్న వారికే కాకుండా బియ్యం తీసుకోని వారికీ నగదు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వరుసగా 3 నెలలు రేషన్‌ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 నగదు సాయం నిలిపివేత అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎ.సృజన రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది.

లాక్‌డౌన్‌ వేళ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్ల రేషన్‌ కార్డు దారులకు నెలకు రూ.1,500 వంతున ఆర్థిక సాయం అందించాల్సిందేనని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. రేషన్‌కార్డుదారులకు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పిన జవాబు పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ ఏడాది మార్చి 20న జారీ చేసిన జీవో 45 ప్రకారం తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ రూ.1,500 వంతున అందజేయాలంది. కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here