ఇటీవల కాలంలో హైదరాబాద్ మెట్రో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. అయితే.. ఈ వార్తలన్ని ఆ సంస్థకు ఏ మాత్రం ఆనందం కలిగించేవి కాకపోవటం గమనార్హం అమీర్ పేట మెట్రో స్టేషన్ శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడి.. పై నుంచి కింద పడిన ఉదంతంలో ఒక యువతి మరణించిన సంగతి తెలిసిందే. దీన్ని మరిచిపోకముందే..పలు స్టేషన్ల వద్ద పగుళ్లు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల క్రితం మెట్రో రైలు లోపల క్యాబిన్ ఒకటి ఊడి రావటంతో అవాక్కు అయ్యే పరిస్థితి.
ఆదివారం పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ వద్ద పెద్ద పీవీసీ పైపు ఒకటి పైనుంచి కింద పడినట్లుగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు వాట్సాప్ లో వైరల్ అయ్యాయి. అయితే.. పీవీసీ పైపు పై నుంచి పడలేదని.. నిర్వహణ పనుల్లో భాగంగానే పని వారు కింద పెట్టారని మెట్రో ఎండీ వివరణ ఇచ్చారు.
ఇలా వరుస పెట్టి మెట్రోకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం బేగంపేట మెట్రో స్టేషన్ కు అధికారులు తాళం వేశారు. భద్రతా కారణాల వల్ల స్టేషన్ ను మూసినట్లు చెప్పటంతో పాటు.. ఆ స్టాప్ లో కొంతసేపు మెట్రో రైళ్లను ఆపకుండా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకిలా? అన్న దానిపై మెట్రో అధికారులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
విశ్వసనీ సమాచారం ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో బేగంపేట మెట్రో స్టేషన్ కు దగ్గర్లో ఉన్న ప్రగతిభవన్ ను ముట్టడించే కార్యక్రమం చేపట్టిన వేళ.. ముందుస్తు చర్యల్లో భాగంగానే స్టేషన్ కు తాళాలు వేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బేగంపేట స్టేషన్ లో రైలు ఆగటం లేదని ముందుగానే ప్రతి స్టేషన్లో నోటీసులు అంటించటం గమనార్హం.
ఈ రోజు (సోమవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఉండడటంతో.. గాంధీ భవన్ నుంచి మెట్రో రైలు ద్వారా బేగంపేటకు పెద్ద ఎత్తున చేరుకునేందుకు వీలుగా ప్లాన్ చేశారని.. ఆ సమాచారం అందుకొని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బేగంపేట మెట్రో స్టేషన్ కు కాసేపు తాళం వేయటంతో పాటు.. ట్రైన్లను సైతం ఆయా స్టేషన్లలో నిలపకుండా చర్యలు తీసుకున్నారు.























