కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని, ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సీఎం సూచించారు. జూలై–ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, అది కూడా హైదరాబాద్ నుంచే వచ్చేలా ఉందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలసి పనిచేస్తున్నాయన్నారు. దేశంలో సరైన సమయంలో తగు నిర్ణయాలు తీసుకుంటూ ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్లు అభిప్రాయపడ్డారు. కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.























