ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉందన్న పవన్ కళ్యాణ్.. కానీ ఇక్కడి నాయకులు మాత్రం వెనుకబడి లేరన్నారు. విశాఖలో జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన జనసేనాని.. ఎక్కడి నుంచో వచ్చిన అవంతి శ్రీనివాస రావు ఎంతో అభివృద్ధి చెందారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు రెండు రిక్వెస్టులు పెడాదమంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిని పులివెందులకు మార్చాలనేది ఒకటైతే.. కోర్టును కర్నూలుకు మార్చడం మరొకటన్నారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందన్న పవన్.. ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు కావడం కోసం జగన్ హైదరాబాద్ వెళ్లాల్సి రావడాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో బొత్సకు, జగన్‌కు ఛాన్స్ ఇద్దామన్న జనసేనాని.. చీపురుపల్లిలో పెడదామన్నా అవకాశం ఇద్దామంటూ ఎద్దేవా చేశారు.
విజయసాయిరెడ్డి మీద ఎలాంటి కేసులైనా ఉండొచ్చు, ఇంటి పేరు సూటుకేసయినా కావొచ్చంటూ మరో జనసేనాని మరోసారి వైఎస్ఆర్సీపీ ఎంపీపై విమర్శలు గుప్పించారు. మన తప్పు లేనప్పుడు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నప్పుడు ఎంతకైనా పోరాడొచ్చన్నారు. తెగింపు ఉంటే ఎవరైనా మనల్ని ఏమీ చేయలేరన్నారు. మనలోని అనైక్యతే కేసులకు కారణమన్నారు. రాపాక వర ప్రసాద్‌కు సమస్య వస్తే.. అందుకే తాము అండగా వచ్చామన్నారు. ఐక్యతే మన బలం అన్న పవన్.. జనసైనికులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. రాజకీయ నాయకులు వ్యాపారం చేయడం లేదా? అని ప్రశ్నించిన పవన్.. తాను సినిమాలు చేస్తే తప్పేంటన్నారు. తాను రాజకీయాల్లోకి రాకుండా సినిమాల్లో ఉంటే ఇవేవీ ఉండేవి కాదన్నారు. కానీ సమాజం బాగు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ‘‘నమస్కారం చంద్రబాబు గారూ… జగన్ బాగున్నారా సార్ అంటే సినిమాకు డబ్బులు కూడా బాగా వస్తాయి. రేట్లు కూడా పెంచుతారు. అలా చేయడం వల్ల వచ్చే డబ్బును ఏం చేసుకుంటాం’’ అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.























