‘‘జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఉపసంహరణతో పాకిస్థాన్ యుద్ధానికి సిద్ధం అవుతోంది అన్న మాటను బూచిగా చూపించి ప్రధాని నరేంద్ర మోదీ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ వ్యవస్థలను జాతీయ స్థాయిలో మోదీ చిన్నాభిన్నం చేస్తున్నారని అన్నారు. రూ.వేల కోట్ల అప్పులను కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసి ఉద్దీపనల పేరుతో దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిట్లర్ తరహా అధ్యక్ష పాలన తేవాలని ప్రధాని మోదీ చూస్తున్నారని నారాయణ ఆరోపించారు. లోక్‌సభ, రాజ్యసభలో 2/3వ వంతు, రాష్ట్రాల అనుమతితో రాజ్యాంగ సవరణ చేయాలని మోదీ వ్యూహ రచన చేస్తున్నారని వివరించారు. మోదీ, షాలు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తెరలేపినట్లు తెలిపారు.
‘‘గోదావరి జలాలను తెలంగాణ నుంచి శ్రీశైలంకు తరలించాలనే ప్రతిపాదన కేవలం కేసీఆర్‌కు మేలు చేయడం కోసమే. తెలంగాణ ప్రాంతంలో జరిగే వర్క్‌లు కేసీఆర్ అనుచరులకు ఇవ్వాల్సిందే. అక్కడ జరిగే మట్టి పని కాంట్రాక్ట్‌ల పేరుతో రూ.వేల కోట్లు కేసీఆర్ దోచుకోవడానికే ఈ పథకాన్ని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు’’ అని నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్ర సీఎం జగన్, కేంద్రానికి అనుకూలంగా లేరన్నారు. అందువలన పోలవరం, రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం లేదని నారాయణ అన్నారు. సీఎం జగన్ పోలవరం, రాజధానిలో అమలు చేస్తున్న విధానాలు రాష్ట్రాభివృద్ధ్దికి విఘాతం కలిగిస్తున్నాయని నారాయణ ఆరోపించారు.























