పిల్లలు లేని జనక మహారాజుకి భూమిని దున్నుతుంటే సీతమ్మ దొరికింది. భూమిజను చూసి మురిసిపోయాడు జనకుడు. సరిగ్గా అలాంటి కథే కాకపోయినా.. దానికి ఇంచుమించుగా ఓ ఘటన తాజాగా చోటు చేసుకుంది. పుట్టిన బిడ్డ చనిపోతే.. ఆ మృతశిశువును పూడ్చటానికి వెళ్లిన ఓ తండ్రికి ఊహించనిరీతిలో మరో బిడ్డ కనిపించింది. నేలలో కొన ఊపిరితో ఉన్న ఆ బిడ్డను గుర్తించిన ఆ వ్యక్తి.. వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. స్థానిక ఎస్పీ కథనం ప్రకారం.. హితేశ్ కుమార్ శిరోహి, వైశాలి భార్యాభర్తలు. వైశాలి పోలీస్ ఇన్ స్పెక్టర్ కాగా, హితేశ్ వ్యాపారి. ఏడో నెల గర్భిణిగా ఉన్న వైశాలికి.. గత బుధవారం నొప్పులు తీవ్రమవ్వడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. గురువారం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ పురిటిలోనే కన్నుమూసింది. ఆ మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు శ్మశానవాటికకు వెళ్లిన హితేశ్… అక్కడ ఓ గుంత తీస్తుండగా.. మూడు అడుగుల లోతులో.. ఏదో తట్టింది. వెంటనే బయటకు తీయగా అదో మట్టికుండ. దాన్ని పరిశీలించగా పసిబిడ్డ కనిపించింది. సజీవంగా ఉందా బిడ్డ. ఒక్కసారిగా గుండె అదిరిపోయింది. వెంటనే తేరుకున్న హితేశ్… భారంగా శ్వాస పీల్చుకంటున్న ఆ బిడ్డను స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ బిడ్డ తల్లెవరో కనుక్కొనే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే ఆ బిడ్డ చికిత్సకు అయ్యే ఖర్చు భరించడానికి ముందుకు వచ్చారు.























