దుమ్ములేపుతున్న విజయ్ ‘బిజిలి’ ట్రైలర్

0
255

‘తెరి’, ‘మెర్సల్‌’తో వరుస విజయాలు సొంతం చేసుకున్న ఇలయ దళపతి విజయ్‌ – దర్శకడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘బిగిల్‌’ హంగామా మొదలైంది. దీపావళికి విడుద ల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేయగా, కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్‌గా మారిపోయింది. 20 గంటల్లోనే 16 మిలియన్ల వ్యూస్‌ దక్కాయంటే ‘బిగిల్‌’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ఎంత రచ్చ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. విజయ్‌ కోచ్‌గా మహిళా ఫుట్‌బాల్‌ జట్టు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కతున్న ‘బిగిల్‌’ ట్రైలర్‌ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌ కోరుకునే కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా వుండడంతో ఉర్రూతలూగిపోతున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ మైఖేల్‌, లోక్‌ల్‌ డాన్‌ రాయప్పన్‌ పాత్రల్లో నటిస్తున్నారు. మైఖేల్‌కు మరో పేరే బిగిల్‌ అని తెలుస్తోంది. ద్విపాత్రాభినయం చేస్తున్నా విజయ్‌ మూడు గెటప్పుల్లో అభిమానులను అలరించబోతున్నారు. ఇక ‘బిగిల్‌’ ట్రైలర్‌కు అభిమానులతోపాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో… 2007లో వచ్చిన ‘చక్‌ దే ఇండియా’ గుర్తుకొచ్చిందని పేర్కొంటూ.. విజయ్‌, అట్లీ, ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఏఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘బిగిల్‌’లో విజయ్‌కు జోడీగా నయనతార నటించగా, యువనటుడు కదిర్‌, ఇందుజ, యోగిబాబు, బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌, డేనియల్‌ బాలాజీ, ఆనంద్‌రాజ్‌, దేవదర్శిని, వివేక్‌, రెబ్బా మోనిక, అమృత అయ్యర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చగా, జీకే విష్ణు సినిమాటోగ్రఫి అందించారు.