ఎకరా భూమిలో 40 ట్రాక్టర్ల చెరువు మట్టి.. దాదాపు 360 కిలోల ఎరువుతో సమానం..

0
280

చెరువు మట్టిలో అనేక పోషకాలతో పాటు నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచే కర్బనం కూడా ఉంటుంది. అందువల్ల ఈ మట్టిని రసాయినిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. చెరువు మట్టిలో నత్రజని 0.3 శాతం, భాస్వరం 0.2 శాతం, పొటాషియం 0.4 శాతం ఉంటాయి. చెరువు మట్టిలో సేంద్రియ కర్బనం 0.77 శాతం నుండి 2 శాతం వరకు ఉంటుంది. అటవీ ప్రాంత చెరువుల్లో కర్బన శాతం ఇంకా అధికంగా ఉంటుంది. చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని పొలాల్లో వేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఎకరా భూమిలో 40 ట్రాక్టర్ల చెరువు మట్టి వినియోగం దాదాపు 360 కిలోల ఎరువుతో సమానమని కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి.

చెరువు మట్టితో ప్రయోజనాలు:
– చెరువు మట్టిలో ఒండ్రు, బంక మట్టి రేణువులు అధికంగా ఉంటాయి. ఈ మట్టిని తోలిన పొలాల్లో నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. నీరు త్వరగా నేలలోకి ఇంకిపోదు.
– ఎర్ర, చల్కా, దుబ్బ, లాటరైట్ నెలల్లో నీటి నిల్వ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. అందువల్లే ఈ నెలల్లో ఆరుతడి పంటల్లో దిగుబడి తక్కువగా ఉంటుంది.
– చెరువు మట్టి ఎర్ర, చల్క, దుబ్బు నేలల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి సమపాళ్ళలో గాలి, నీరు నిల్వ ఉండేలా చేస్తుంది. వేసవిలో చెరువు మట్టిని తోలి, ఈ నేలల్లోనూ దిగుబడి పెంచుకోవచ్చు.
– చెరువు మట్టిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం తగినంత ఉండటం వలన ఉదజని సూచిక 7 – 7.5 వరకు ఉంటుంది.
– చెరువు మట్టి వేసిన చేలల్లో వేసవిలో నేల ఉష్ణోగ్రతల్లో పెద్దగా హెచ్చుతగ్గులు ఏర్పడవు. తద్వారా పైర్లు త్వరగా బెట్టకు గురికాకుండా ఉంటాయి.
– చెరువు మట్టి వాడిన పొలాల్లో తేమ నిలిచే కాలం 4 – 7 రోజులకు పెరుగుతుందని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ‘క్రీడా’ అధ్యయనంలో తేలింది. చెరువు మట్టి వాడినప్పుడు, దిగుబడులు 10 – 15 శాతం పెరిగే అవకాశం ఉంటుందని వారి అధ్యయనాల్లో తెలిసింది.
– చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్ధం సూక్ష్మ మరియు ఇతర పోషక పదార్ధాలను సమతూకంగా మొక్కలకు అందిస్తుంది.
– చెరువు మట్టిని చేనులో వేసినట్లయితే నేలను కలుషితం చేసే భారీ లోహాలను పీల్చుకుని భూగర్బ జలాలు కలుషితం కాకుండా చేస్తుంది.

ముఖ్య గమనిక: పట్టణ ప్రాంత పరిసరాల్లోని మరియు పరిశ్రమల దగ్గరగా ఉన్న చెరువుల నుంచిమట్టిని తీసి పొలంలో వాడుకునే ముందుగా తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించుకుని మంచిది అని తేలిన తరువాతనే ఆ మట్టిని పొలంలో ఉపయోగించుకోవాలి.