పంజాబ్ హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే.

0
197

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నియామకం దాదాపు ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్‌లో హెడ్‌ కోచ్‌గా ఉన్న మైక్ హసన్.. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి డైరెక్టర్‌గా వెళ్లిపోయాడు. దీంతో.. కోచ్ వేటలో పడిన కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ.. మైకేల్ హస్సీ, ఆండీ ప్లవర్, డారెన్ లెహ్మాన్ తదితరులతో చర్చలు జరిపింది. కానీ.. అవి ఫలించలేదు. అయితే.. గత రెండు వారాలుగా అనిల్ కుంబ్లేతో హెడ్ కోచ్‌ విషయమై మాట్లాడిన పంజాబ్ ఫ్రాంఛైజీ.. ఎట్టకేలకి అతడ్ని ఒప్పించినట్లు తెలుస్తోంది.

భారత్ జట్టుకి ఏడాదికాలం హెడ్ కోచ్‌గా పనిచేసిన అనిల్ కుంబ్లే.. ఐపీఎల్‌లో మాత్రం ఇప్పటి వరకూ ఏ టీమ్‌కీ కోచ్‌గా పనిచేయలేదు. కాకపోతే.. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌కి మాత్రం కొన్ని సీజన్లు మెంటార్‌గా పనిచేశాడు. అయినప్పటికీ.. క్రికెట్‌లో అతనికి ఉన్న అపార జ్ఞానం కారణంగా జట్టుని ముందుకు తీసుకెళ్లగలడని పంజాబ్ ఫ్రాంఛైజీ విశ్వసిస్తోంది.

భారత్ తరఫున దాదాపు 18 ఏళ్లు క్రికెట్ ఆడిన అనిల్ కుంబ్లే.. కెరీర్‌లో 132 టెస్టులు, 271 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లోనూ 42 మ్యాచ్‌లాడిన ఈ దిగ్గజ స్పిన్నర్ ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. పంజాబ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామకం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో ఐపీఎల్ 2020 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకూ పంజాబ్ టీమ్ ఒక్క సారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.