బంగారం లేదు.. మరేమీ లేదు. ఉత్త చాక్లెట్లే. కాకుంటే.. మనం రోజువారీ తినే చాక్లెట్ల కంటే మరింత మేలైన ముడిపదార్థాలతో తయారు చేసిన 15 చాక్లెట్ల ధర తెలిస్తే నోట మాట రాదంతే. డబ్బుల కట్టలు తిన్నట్లు ఉండే ఈ చాక్లెట్ల కత తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్లను ప్రముఖ వినియోగ వస్తువుల ఉత్పత్తి సంస్థ ఐటీసీ రూపొందింది.
కేవలం 175 గ్రాముల బరువుండే 15 చాక్లెట్లు (ఒక్కొక్క చాక్లెట్ 15 గ్రాములు ఉంటుంది) బాక్స్ ధర ఏకంగా రూ.4.3లక్షలుగా ప్రకటించారు. ఇంత ఖరీదైన చాక్లెట్లు ప్రపంచంలోనే ఇదేనని తేల్చటమే కాదు.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నిర్దారించింది.
ప్రత్యేకమైన ఫ్యాబెల్ ఎక్స్ క్విజిట్ బ్రాండ్ లో ట్రినిటీ ట్రఫల్స్ ఎక్స్ ట్రార్డినెయిర్ అనే పేరుతో లిమిటెడ్ ఎడిషన్ లో మాత్రమే ఈ చాక్లెట్లను ఐటీసీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ చాక్లెట్ల కంటే కూడా.. ఖరీదైన వీటిని ప్యాక్ చేసిన విధానం గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పాలి. చేతితో తయారుచేసిన చెక్క పెట్టలో ఈ పదిహేను విలువైన చాక్లెట్లను ఉంచుతారు.
ఈ పెట్టె ఖరీదే రూ.లక్షగా చెబుతున్నారు. ఇక.. ఈ ఖరీదైన చాక్లెట్లకు ఉన్న మరో విశేషం ఏమంటే.. ఫ్రాన్స్ కు చెందిన చాక్లెట్ల తయారీ నిపుణుడు ఫిలిప్ కొంటిచినీ.. ఫ్యాబెల్ లోని భారత నిపుణులు కలిసి వీటిని రూపొందించారు. చెప్పుకునేందుకు మా గొప్పగా ఉన్న ఈ చాక్లెట్లను ఇంతకీ కొని తినే వారెవరూ? కేవలం రికార్డుకోసం.. కంపెనీ ప్రచారం కోసమే తయారు చేసినట్లు ఉన్నాయే తప్పించి.. అస్వాదిస్తూ తినే వారు ఎంతమంది ఉంటారంటారు?























