ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వారికి ఇచ్చే బాధ్యతలు, వారికి అప్పగించిన పనులు అన్నీ సంచలనంగా మారాయి. ప్రభుత్వాన్ని గుమ్మం వద్దకు తీసుకు వెళ్ళడానికి గాను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు ప్రసంశలు కురవగా… కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడిన నెలల వ్యవధిలోనే వారిని నియమించుకుని నిత్యం సమావేశాలు, శిక్షణ, సర్వేలతో వార్డు, గ్రామ వలంటీర్లు జిల్లాస్థాయి అధికారుల కంటే బిజీగా కనిపిస్తున్నారు.
నియామక పత్రాలు అందుకుని వేర్వేరు కారణాలతో కొంతమంది.. పని ఒత్తిడి కారణంగా మరికొందరు నిలిచిపోయారు. ఇటీవలే వీరు ఇంటింటి సర్వే పూర్తి చేయగా.. తాజాగా ఇంటింటికీ వెళ్లి ఓటు నమోదు చేసే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. వలంటీర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఏకధాటిగా పనిచేస్తున్నారు. విధుల్లో చేరిన ప్రారంభంలో కొద్దిరోజుల పాటు శిక్షణనిచ్చారు. ఇంటింటి సర్వే సమయంలో గుర్తింపు కార్డులు లేక వార్డు వలంటీర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. అతికష్టం మీద ఇంటింటి సర్వే పూర్తి చేసారు.
ఇప్పుడు వారికి మరో బాధ్యత అప్పగించారు… వలంటీర్లు కొత్త ఓటర్ల వివరాలు తమకు సూచించిన యాప్‌లో నమోదు చేయాలి. అనంతరం కొత్త ఓటరు మీ-సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఇంటింటికీ తిరిగి ఓటర్‌కార్డులు లేనివారికి కొత్తకార్డు వచ్చేలా.. చనిపోయినవారి కార్డు తొలగించేలా.. మళ్లీ సర్వే చేయాలి. ఇప్పుడు వారిని మరో ఆందోళన వెంటాడుతుంది… వలంటీర్లకు రూ.5వేల గౌరవ వేతనం సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఇవ్వనున్నారు. నెలకు రూ.5 వేల చొప్పున వీరి వార్షికాదాయం రూ.60 వేలు అవుతుంది. దీనితో వారికి రేషన్ కార్డులు ఉంటాయా లేదా అనేది ఆందోళనగా మారింది.























